07-08-2025 01:25:16 AM
- నకిలీ సర్టిఫికెట్లతో నగరంలో రోహింగ్యాల తిష్ట
- జీహెచ్‌ఎంసీ జనన, మరణాల నమోదు ఇక కేంద్రం పరిధిలోకి
- రెండు నెలలుగా సీఎం కార్యాలయంలో పెండింగ్‌లో కీలక ఫైల్
- ఆమోదం లభిస్తే దేశంలో ఎక్కడినుంచైనా సర్టిఫికెట్ పొందే వెసులుబాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న భారీ అవకతవకలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు జీహెఎంసీ సిద్ధ మైంది. బోగస్ సర్టిఫికెట్లతో రోహింగ్యాలు నగరంలో తిష్ట వేస్తున్నారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, ఈ ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ సివిలియన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు పంపిన కీలక ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించడమే మిగిలి ఉంది.
గతం లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, గత ఏడాది నవంబర్ లో యూసుఫ్‌గూడ సర్కిల్ పరిధిలో ‘బర్త్ ఎట్ హోమ్’, ‘డెత్ ఎట్ హోమ్’ పేరిట అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ అయినట్టు గుర్తిం చిన అప్పటి కమిషనర్ కే ఇలంబర్తి, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ లో మూడు సర్కిళ్లలో భారీగా బోగస్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు తేలింది. ఈ కుంభకోణాన్ని సీరియస్‌గా తీ సుకున్న ఆయన, ఈ దందాను శాశ్వతంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా యూనిక్ నెంబర్‌తో సర్టిఫికెట్లు జారీ చేసే సీఆర్‌ఎస్ విధానాన్ని తెరపైకి తెచ్చారు.
రెండు నెలలుగా సీఎం వద్ద ఫైల్..
దేశవ్యాప్తంగా ఇప్పటికే 16 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న ఈ సీఆర్‌ఎస్ విధానాన్ని జీహెచ్‌ఎంసీలోనూ ప్రవేశపెట్టాలని రాష్ర్ట ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రం, జీహెచ్‌ఎంసీ అధికారుల మధ్య జూమ్ మీటింగ్ కూడా జరిగింది. అయితే, ఈ విధానాన్ని అమలు చేయడానికి రాష్ర్ట ప్రభుత్వ తుది అనుమతి అవసరం. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ రెండు నెలల క్రితమే సీఎం కార్యాలయానికి ఫైల్ పంపగా, అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. పురపాలక శాఖను నేరుగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తుండటంతో అనుమతికి కాస్త ఆలస్యమవుతోందని అధికారులు భావిస్తున్నారు.
సీఆర్‌ఎస్ అమలుతో ప్రయోజనాలు?
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు చెబుతున్నారు.
బోగస్‌కు చెక్: కేంద్రం పోర్టల్ ద్వారా యూనిక్ నెంబర్‌తో సర్టిఫికెట్ జారీ అవుతుంది కాబట్టి, బోగస్ సర్టిఫికెట్లకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది.
దేశవ్యాప్త సేవలు: జీహెచ్‌ఎంసీలో జారీ అయిన సర్టిఫికెట్‌ను నగరవాసులు దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో పొందే వెసులుబాటు కలుగుతుంది.
సులభంగా సెన్సస్: జనన, మరణాల లెక్కలు అత్యంత పక్కాగా కేంద్రం వద్ద నమోదవుతాయి. ఇది భవిష్యత్తులో జనాభా లెక్కల (సెన్సస్) సేకరణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కార్యాల యం నుంచి అనుమతి రాగానే, ఇప్పటివరకు ఉన్న ఈ-సేవా కేంద్రాల లింకును తొలగించి, నేరుగా కేంద్ర ప్రభుత్వ యాప్‌కు అనుసంధానం చేస్తారు. అంతేకాకుండా, ఇప్పటివరకు జీహెఎంసీలో నమోదైన మొత్తం జనన, మరణాల డేటాను కూడా కేంద్రం పోర్టల్‌కు బదిలీ చేసేందుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉన్నారు.