07-08-2025 01:20:08 AM
కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ ఆగస్టు 6 (విజయ క్రాంతి): స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని, జయశంకర్ సార్ స్ఫూర్తితో ముందుకు సాగాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో ఆచార్యుడి శిలా విగ్రహానికి కలెక్టర్ రాహుల్ శర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అలాగే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అనిల్ కుమార్ ఇతర జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
ములుగు, ఆగస్టు6(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు. బుదవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిం చిన కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించినారు.
ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను జిల్లా ఉన్నతాధికారులు స్మరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని రాష్ట్ర పండుగ లాగా నిర్వహిస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపట్టానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉందని, స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసారని, రాష్ట్ర అభివృద్ది కొరకు మంచి ప్రణాళికలు సైతం రూపొందించారని,ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ కాలజ్ఞాని జయశంకర్
హనుమకొండ టౌన్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదని ఫూలే ఆశయ సాధన సమితి ( పాస్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ కొనియాడారు. బుధవారం పాస్ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 91వ జన్మదినం సందర్బంగా కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్స్ లోని జయశంకర్ విగ్రహానికి పాస్ సభ్యులతో కల్సి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుచూ తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సార్ ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని అయన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య, ఉమ్మడి జిల్లా కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, పాస్ జిల్లా నాయకులు డాక్టర్ స్వర్ణలత, మెరుగు బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి
హనుమకొండ టౌన్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా పార్కులోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ తహశీల్దార్ రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ విగ్రహానికి మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాన్ని పురస్కరిం చుకొని బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా పార్కులోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రొఫెసర్ గా ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ తహశీల్దార్ రవీందర్ రెడ్డి, సాంబారీ సమ్మారావు,ప్రొఫెసర్ జయశంకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
చిట్యాలలో..
చిట్యాల,ఆగస్టు 6(విజయ క్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ శంకర్ సార్ 91వ జయంతి వేడుకలను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంతోపాటు, వివిధ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.విశ్వబ్రాహ్మణ,విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష ,కార్య దర్శులు,ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య వీరి వీరిగా నిర్వహించిన కార్యక్రమాల్లో జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి పూలమాలలు వేశారు. ఆయన ఆలోచనలు, పోరాటం మార్గదర్శకంగా నిలిచాయని కొనియాడారు.ప్రభుత్వం ఆయన జయంతిని అధికార పూర్వకంగా జరపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శృంగారపు రంగాచారి, మొగులోజు భగవత్ చారి , పోతగంటి చంద్రమౌళి, చిలువుల రాజమౌళి,కలచర్ల కృష్ణమూర్తి, చిలుముల రమణాచారి, తిరుపతి, ఏవైఎస్ మండల అధ్యక్షుడు జన్నె యుగేందర్, కట్కూరి రాజు,పాముకుంట్ల చందర్ పాల్గొన్నారు.
మహదేవపూర్‌లో..
మహదేవపూర్, (భూపాలపల్లి) జులై 6 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆచార్య జయశంకర్ చిత్ర పటముకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు .