07-05-2025 12:09:48 AM
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ప్రతీ పౌరుడికి ఆధార్‌తో గుర్తింపు ఇచ్చినట్టుగానే ప్రతీ రైతుకు 14 నెంబర్లతో కూడిన విశిష్ట (యూనిక్ కోడ్) సంఖ్యను కేటాయించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగాన్ని మొత్తం డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్రం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. రైతులకు యూనిక్ కోడ్ గుర్తింపు కార్డును అందించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.
భూమి ఉన్న ప్రతీ రైతుకు.. తనకున్న భూములకు సంబంధించి ‘ఫార్మర్ రిజిస్టీ’ నిర్మితమవుతుంది. ఈ కార్డులకు సంబంధించి పూర్తి వివరాలను ఈ నెలఖారులోగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, భూమి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఆయా జిల్లా వ్యవసాయ అధికారుల నేతృత్వంలో ఏఈవోలు రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను మొబైల్ యాప్‌లో క్రోడికరించి, నమోదు చేయనున్నారు.
ఒక్కో రైతు వివరాల సేకరణకు కనీసం ఐదు నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, దాంతో ఒక్కోరోజుకు ఒక్కో ఏఈవో 50 మంది రైతుల వివరాలు సేకరించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యజమాన్య వివరాలను రైతు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడీని కేటాయించనున్నారు.
అయితే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఏ రకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదు. కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ రైతులకు ఫార్మర్ ఐడీ కేటాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయనున్నారు.
పీఎం కిసాన్ లబ్ధిదారులకు, ఆ తర్వాత విడుత లబ్ధి పొందుటకుగాను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు, ఈ ఫార్మర్ రిజిస్ట్రీకి ఎలాంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న వరికి రూ.500 బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడీ) పొందటానికి ఆధార్, భూ యాజమాన్య పాస్‌బుక్, ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ తీసుకొని సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని ఆశ్రయించి, ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది.