calender_icon.png 16 January, 2026 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటన

16-01-2026 05:35:49 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): అక్టోబర్ నెలలో మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపు, కోతకు గురైన రోడ్లు, కూలిన ఇండ్లను కేంద్ర అధికారుల బృందం హనుమకొండ జిల్లాలో శుక్రవారం పరిశీలించారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో జరిగిన పంట నష్టం, రోడ్లు, విద్యుత్, ఇండ్ల నష్టంపై అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో కేంద్ర వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ డైరెక్టర్‌ కె.పొన్నుస్వామి నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటించింది.

ముందుగా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామ ప్రధాన రహదారి వరద ధాటికి దెబ్బతిన్న రోడ్డును కేంద్ర అధికారుల బృందం, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి  పరిశీలించారు. గ్రామంలో దెబ్బతిన్న పంటల వివరాలను రైతులు, స్థానికులను కేంద్ర అధికారుల బృందం ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. వరద ధాటికి దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలకు సంబంధించిన ఛాయా చిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హనుమకొండ, సమ్మయ్య నగర్, గోపాల్ పూర్ ఊర చెరువు కట్ట, వరద ముంపునకు గురైన అమరావతి నగర్  ప్రాంతాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి కేంద్ర అధికారుల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర అధికారుల బృందం వెంట జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, పంచాయతీ రాజ్ ఈఈ ఆత్మారామ్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, ఆర్ అండ్ బి అధికారులు గోపికృష్ణ, ఉదయ్, హనుమకొండ తహసిల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.