సీసీటీవీతో చిక్కిన చైన్ స్నాచర్
వృద్ధురాలి మెడలో నాలుగు తులాల పుస్తెలతాడు లాక్కెళ్లిన నిందితుడి అరెస్టు
మేడ్చల్, జూన్ 29(విజయ క్రాంతి) : చిర్యాల గ్రామంలో వృద్ధురాలి మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన నిందితుడిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడుతో పాటు నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్యాల గ్రామానికి చెందిన సింగిరెడ్డి మల్లమ్మ ఇంట్లోకి ఈ నెల 26న తెల్లవారుజామున ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించాడు.
ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు కత్తి అనిల్కుమార్ను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా, అప్పుల బాధతోనే దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని అరెస్టు చేసి, దోచుకున్న బంగారు పుస్తెలతాడుతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, ఎస్‌ఐ అనిల్కుమార్తో పాటు దర్యాప్తు బృందాన్ని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ అభినందించారు.






