17 May, 2026 | 8:48 AM

తెలంగాణపై చంద్రబాబు ఫోకస్

26-08-2024 08:11 AM
  1. టీటీడీపీ విస్తరణకు ప్రణాళికలు 
  2. పాత కమిటీలన్నీ రద్దు చేసిన అధినేత చంద్రబాబు 
  3. పనిచేసిన వారికే పదవులు

హైదరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): తెలంగాణలో టీడీపీ విస్తరణపై ఏపీ సీఎం, అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణలోనూ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రెండు వారాలకు ఒకసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శ్రేణులతో సమాచాలోచనలు జరుపుతున్నారు. ఆగస్టు 10న పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించిన అధినేత ఆదివారం మరోసారి భేటీ అయి పార్టీ విస్తరణపై దిశానిర్దేశం చేశారు.

పార్టీ పునర్నిర్మాణం దిశగా..

తెలంగాణలో ఐదేళ్లుగా టీడీపీ స్తబ్ధుగా ఉంది. ఏపీలో అధికారంలో కోల్పోయిన తర్వాత తెలంగాణలో పార్టీ నిర్మాణంపై చం ద్రబాబు దృష్టిసారించలేకపోయారు. ఫలితంగా నడిపించేవారు లేక క్యాడర్ కూడా నైరాశ్యంలో పడిపోయింది. టీడీపీకి క్షేత్రస్థాయిలో బలంగా ఉందని అధినేత భావిస్తు న్నారు. అందుకే కొంతకాలంగా అస్తవ్యస్థంగా ఉన్న నిర్మాణాన్ని ఇటుక ఇటుక పేర్చుకొని పునర్మించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

పాత కమిటీలు రద్దు..

టీడీపీ ప్రక్షాళనలో భాగంగా పాత కమిటీలను రద్దు చేస్తూ చంద్రబాబు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తెలంగాణలో పార్టీకి కొత్త ఊపిరి ఇస్తుందన్న నమ్మకంలో శ్రేణులు ఉన్నారు. ఏపీలో పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులైన నేపథ్యంలో అక్కడ కొత్త కమిటీని ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఏపీకి, తెలంగాణకు కలిపి ఒకేసారి కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

సభ్యత్వ నమోదుతో ఉత్సాహం

టీటీడీపీని బలోపేతం చేసేందుకు సభ్య త్వ నమోదు చేపట్టాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నాయకులకు అధినేత దిశానిర్దేశం చేశారు. సభ్యత్వాలను పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. కష్టపడిన వారికి పార్టీలో పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లు అని చంద్రబాబు శ్రేణులతో పునరుద్ఘాటించారు.

నెలకు రెండు రోజలు తెలంగాణ నేతలకు కేటాయిస్తానని గతంలో బాబు చెప్పారు. ఆయన చెప్పిన విధంగా ఈ నెలలో రెండు సార్లు ఇక్కడి నేతలతో భేటీ కావడం.. సభ్య త్వ నమోదును ప్రారంభించాలని చెప్పడం తో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొం ది. బాబు వరుస పర్యటనలు రాజకీయ వర్గాల్లో కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వ్యూహాత్మక అడుగు.. 

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చే ఆలోచనల వెనుక చంద్రబా బు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో వచ్చిన 16 సీట్లతోనే చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. భవిష్యత్‌లోనూ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీంతో ముందు ఆలోచనతో తెలంగాణలో పార్టీ ని బలోపేతం చేయడం వల్ల జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రాబల్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ భవిష్యత్‌లో అధికారంలోకి రావడానికి తెలంగాణలో టీడీపీ మద్దతును అనివార్యంగా తీసుకోవాలన్న పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల బీజేపీ నాయకత్వం వద్ద చంద్రబాబు పరపతి మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు.