17 May, 2026 | 9:43 AM

బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమే లక్ష్యం!

26-08-2024 08:09 AM
  1. కాంగ్రెస్ రెండో విడత ఆపరేషన్ ఆకర్ష్‌కు రెడీ 
  2. హస్తం గూటికి ఐదారుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 
  3. నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముహూర్తం 
  4. ఇప్పటికే హస్తం గూటికి 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు 
  5. మొత్తం 26 మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం 

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాం తి): అధికార కాంగ్రెస్ రెండో విడత ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టిసారించింది. కారును ఖాళీ చేయడంతోపాటు బీఆర్‌ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే లక్ష్యంగా కసరత్తు ముమ్మరం చేసింది. అసెంబ్లీ సమావేశాల ముందు చేరికల విషయంలో కొంత స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్.. చేరికల జోరును పెంచాలనే ఆలోచనతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల  సమాచారం. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. త్వరలోనే మరో ఐదారుగురు ఎమ్మె ల్యేలు హస్తం గూటికి చేరుకోనున్నారని తెలుస్తుంది. కుదిరితే ఈ నెలాఖరు లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.

వీరంతా గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎక్కువగా ఉన్నారని, ఒకరిద్దరు పాలమూరు, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు వినిపిస్తుంది. బీఆర్‌ఎస్‌ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనమవుతుం దని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ ఆలోచనతో ఉన్నట్టు సమాచా రం. అందులో భాగంగానే మొదటి విడతలో బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, అరికపుడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌కు గాలం వేయడం లో సక్సెస్ అయింది.

ఇంకా 16 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే లక్ష్యం చేరకుంటామని కాంగ్రెస్ వర్గాలు భావించాయి.  ఒకవైపు రైతు రుణమాఫీ, సంక్షేమ పథకాల అమలుకు నిధులు వంటి సమస్యలపై ప్రభు త్వం దృష్టి పెట్టడం వల్ల చేరికల విషయంలో కాస్త విరామం ప్రకటించినట్టు చెప్పుకొచ్చారు.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం తోపాటు కోర్టుకు కూడా వెళ్లారు. మొదటి విడతలో కాంగ్రెస్‌లో చేరిన వారిపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే మరో 16 మంది గులాబీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై పార్టీ నేతలు సీరియస్‌గా దృష్టిసారించినట్టు తెలుస్తోంది.