calender_icon.png 15 September, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విప్లవ గీతాలతో దద్దరిల్లిన చంద్రవెళ్లి!

15-09-2025 12:00:00 AM

-కన్నీటి వీడ్కోలు మధ్య మావోయిస్టు వెంకటి అంతిమ యాత్ర

బెల్లంపల్లి, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి):  మంచిర్యాల జిల్లా చంద్రవెళ్లి గ్రామం ఆదివారం సాయంత్రం విప్లవ గీతాలతో దద్దరిల్లింది. గురువారం ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ అడవుల్లో కేంద్ర బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసిన మావోయిస్టు పార్టీ ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యులు జాడి వెంకటి అలియాస్ విమల్ అలియాస్ మంగన్న భౌతిక దేహం ఆదివారం సాయం త్రం చంద్రవెళ్లి గామానికి చేరుకుంది. గ్రామస్తులు శనివారం ఉదయం చంద్రవెళ్లి గ్రామం నుండి ఛత్తీస్‌గఢ్ వెళ్లి గరియాబంద్‌లో పోస్టుమార్టం చేసి భద్రపరిచిన వెంకటి భౌతిక దేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. ఛత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి భౌతిక దేహాన్ని తీసుకు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో దారి తప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షా ల కారణంగా వార్ధా నది ప్రవాహం పెరగడంతో మూడు గంటల పాటు మృతదేహాన్ని తీసుకువస్తున్న ఆంబులెన్స్ అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో వెంకటి భౌతిక దేహం గ్రామానికి చేరుకుంది. వెంకటి భౌతిక దేహం ఆంబులెన్స్‌లో గ్రామానికి చేరుకోగానే విరసం నేతలు, అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు భౌతిక దేహంపై ఎర్రజెండాను కప్పి కన్నీటి వీడ్కోల మధ్య విప్లవ నివాళులర్పించారు. మావోయిస్టు నేత జాడి వెంకటితో అనుబంధం ఉన్న చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు అంతిమయాత్రలో పాలు పంచుకున్నారు. అశేషంగా తరలివచ్చిన జనంతో చంద్రవెళ్లి గ్రామం జన సంద్రంగా మారింది.

అంతిమయాత్రలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఆర్.ప్రవీణ్ , మాజీ జెడ్పిటిసి కారుకూరి రామ్ చందర్ , టిపిసిసి ప్రచార కమిటీ కన్వీనర్ నా తర నాథరి స్వామి, కాంగ్రెస్ నాయకులు చిలుముల శంకర్, తొంగల మల్లేష్ , ఏఐటీయూసీ నాయకులు మేకల దాసు, సిపిఐ మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, మేకల పోషమల్లు,తెలంగాణ ప్రజా పంట కరీంనగర్ ప్రధాన కార్యదర్శి ఆయిందాల అంజన్న, హనుమకొండ ఉపాధ్యక్షులు పెట్టం కుమారస్వామి, తెలంగాణ రైతు విధాన సమితి అధ్యక్షులు ముడిమడుగుల మల్లయ్య, విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాజన్న, సింగరేణి ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న,అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ కుమారి, ఉపాధ్యక్షురాలు శాంతక్క, సభ్యులు సత్యక్క, కవితక్క, అనిత, సోషల్ సైంటిస్ట్ మేడ ప్రవీణ్ కుమార్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కన్వీనర్ ఏ. సారయ్య, ఉమ్మడి కరీంనగర్ ఈసి మెంబర్ శ్రీపతి రాజగోపాల్, సభ్యులు యాదనవేని పర్వతాలు, ఎన్.సత్యనారాయణ, బండి శంకర్, బాలసాని రాజయ్య, ప్రజా కళామండలి అధ్యక్షులు ఏ .సమ్మయ్య, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్మ రాజయ్య లతోపాటు గ్రామస్థులు, లొంగిపోయిన మాజీ మావోయిస్టులు, సానుభూతిప రులు పాల్గొన్నారు.