calender_icon.png 29 January, 2026 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉపాధి’ పథకం పేరు మార్పు తగదు

29-01-2026 12:48:43 AM

  1. కొత్త చట్టం వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమిస్తాం

కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ 

నిధులపై ప్రధాని మోదీ కోత:పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

మానకొండూరు/చిన్నశంకరంపేట/చేగుంట, జనవరి 28 (విజయక్రాంతి): పంజాబ్ రాష్ట్రంలో రైతు వ్యతిరేక చట్టాల మాదిరిగానే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి, మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కోర్విపల్లి గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

ఉపాధి కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేతల మార్గదర్శకంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని ఆమె స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ పేరు మార్చడమే కాకుండా నిధులపై ప్రధాని మోదీ కోత పెడుతున్నారని విమర్శించారు. రూ.100 కు కేంద్రం రూ.60 ఇస్తే మిగిలిన రూ.40 మనమే పెట్టుకోవాలని ఆంక్షలు పెడుతూ రాష్ట్రంపై భారం మోపుతున్నారని విమర్శించారు.

అంబానీ, అదానీల కోసం మోదీ పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 150 డాలర్లు ఉన్న క్రూడాయిల్ ధర 50 కి పడిపోతే పెట్రోల్ ధర తగ్గించకుండా కేంద్రం ప్రజలపై భారం మోపుతూ 90 లక్షల కోట్లు జేబులో వేసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీదల ప్రభుత్వమని, బీజేపీ డబ్బున్న వాళ్ళ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వారికి బీఆర్‌ఎస్ వాళ్లు తోడయ్యారని, ఇద్దరూ తోడు దొంగలని విమర్శించారు.

ఆయా సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఓబిసి రాష్ట్ర చైర్మన్ జూలూరి ధనలక్ష్మి, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ సిహెచ్ శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ ప్రతినిధి అనిల్, పీసీసీ ప్రతినిధి ముబాకర్ అలీ ఖాన్, దండాలయ్య చైర్మన్ సుహాసిని, దుబ్బాక ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.