18 April, 2026 | 6:08 PM

భక్తి, ఆధ్యాత్మికత మేల్కొలుపు చిడా-దహి మహోత్సవం

10-06-2025 12:53 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కోకాపేటలో హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో పానిహటి చిడా-దహి మహోత్సవాన్ని భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఈ మహోత్సవానికి ప్రాము ఖ్యం ఉంది.

సుమారు 500 ఏండ్ల కింద శ్రీనిత్యానంద ప్రభు ఆజ్ఞతో శ్రీ రఘునాథదాస గోస్వామి పానిహటిలో (బెంగాల్) అటుకుల అన్నం, పెరుగు, పాలు, పండ్లు ఇతర భక్తిపూర్వక పదార్థాలతో మహాభోజనాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవం, భక్తి సేవలో నిమగ్నమై చైతన్య మహాప్రభు, నిత్యానందుని తృప్తిపరచడం ద్వారా పరమ కృపను పొందొచ్చనే సందేశాన్ని అందిస్తోంది.

దీన్ని దండ మహోత్సవంగానూ పిలుస్తారు. పానిహటి చిడా దహి ఉత్సవాల్లో భాగంగా జపయజ్ఞం, నగర సంకీర్తన, కొత్త భక్తుల దీక్షా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గురుకుల పిల్లలు ప్రదర్శించిన నాటిక, ఆధ్యాత్మిక బోధనలతో కూడిన ప్రవచనం, తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షుడు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎంటెక్, ఐఐటీ చెన్నై) మాట్లాడుతూ.. భగవంతుడి కృపను పొందాలంటే భక్తుల సేవే సులభమైన మార్గమన్న విషయాన్ని పానిహటి చిడా-దహి మహోత్సవం బోధిస్తుందని చెప్పారు.

ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా దైవ సేవలో పాల్గొనడం ద్వవారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రవచనం అనంతరం ప్రతి ఒక్కరికి రుచికరమైన ప్రసాద భోజనం వడ్డించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు.