calender_icon.png 13 September, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీ మార్గమే రాజ మార్గం

13-09-2025 07:22:51 PM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్

జిల్లా కోర్టు లోని న్యాయ సేవా సదన్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ఖమ్మం (విజయక్రాంతి): రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ లో జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్ లో రాజీతో ఇరువర్గాలు గెలిచినట్లేనని, లోక్ అదాలత్ తీర్పు, సుప్రీంకోర్ట్ తుది తీర్పుతో సమానమని అన్నారు. లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. రాజీ మార్గంలో కక్షిదారులు లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకొని తమ కేసులను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. కేసులను రాజీతో ముగించేందుకు ఇలాంటి లోక్ అదాలత్ లు ఉపయోగపడతాయన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా న్యాయ సేవా సంస్థ సహకారంతో కేసులను పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో 4746 కేసులను గుర్తించి, ఇప్పటికే 502 కేసులు పరిష్కరించగా, గత లోక్ అదాలత్ లో 19849 కేసులను పరిష్కరించినట్లు ప్రధాన నాయమూర్తి తెలిపారు. ప్రస్తుత లోక్ అదాలత్ లో 597 కేసుల పరిష్కారం అవనున్నట్లు అన్నారు. భాగస్వాములందరూ లక్ష్య సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, భవిష్యత్తులో న్యాయ సేవాధికార సంస్థ సేవలు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో తీసుకెళ్లడానికి బార్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ లో మోటార్ వాహన కేసుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ప్రమాద మరణానికి 19.50 లక్షల సెటిల్ మెంట్ కు సంబంధించి, పెద్దబోయిన మాధవి, పెద్దబోయిన లక్ష్మణ్  ల ఫ్యామిలీ కేసుకు సంబంధించి పరిష్కారం చేసి, అవార్డు తోపాటు పూల మొక్కలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బహుకరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు దేవినేని రాంప్రసాదరావు,  న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర రావు, ఎం. కల్పన, టి. మురళీమోహన్, కాసరగడ్డ దీప, బెక్కం రజని, ఏపూరి బిందు ప్రియ, వినుకొండ మాధవి, బి. నాగలక్ష్మి, అఖిల, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, మీడియేటర్స్, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.