19 June, 2026 | 1:39 AM

పబ్బతి ఆంజనేయస్వామి పాలకమండలి చైర్మన్‌గా చింతల మనోహర్‌రెడ్డి

19-06-2026 12:00 AM

ఊర్కొండ, జూన్ 18: మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవస్థానం నూతన ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్గా చింతల మనోహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఊర్కొండ స్టేజ్ నుంచి దేవాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శకుంతల నూతన పాలకమండలితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలకమండలి సేవలు అందించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు  పాల్గొన్నారు.