15-08-2025 07:05:51 PM
ఉద్యమ వీరులకు ఇచ్చే నిజమైన నివాళి
సీఐటీయు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్
కామారెడ్డి,(విజయక్రాంతి): సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటాలే భారత స్వాతంత్రోద్యమ వీరులకు ఇచ్చే నిజమైన నివాళులని సీఐటీయు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయు కార్యాలయం, బజారు హమాలీలు, ఆటో కార్మికులు ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సాబ్రాతృత్వం కోసం పోరాడి భగత్ సింగ్ రాజ్ గురు, సుఖ్ దేవ్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎందరో విప్లవ వీరులు ప్రాణాలర్పించారని అన్నారు.
దేశ స్వాతంత్రం కోసం పోరాడటంతో పాటు వలసవాద, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు సైతం మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. కాని నేడు అమెరికా సామ్రాజ వాద దురహంకారంతో భారతదేశంపై పెత్తనం చెలాయిస్తూ 50 శాతం టారిఫ్లు విధించిందని తెలిపారు. నాడు సామ్రాజవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్రోద్యమ వీరుల స్ఫూర్తితో నేడు అమెరికా చేస్తున్న యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా, ప్రపంచ దేశాలపై చేస్తున్న పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.నాడు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర ఉద్యమం నడిపారని అన్నారు.
కానీ నేడు దేశంలోని పాలకులు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను విస్మరిస్తూ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలపై ఉక్కు పాదాల మోపుతూ, సమానత్వాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని విమర్శించారు. దేశంలోని సహజ వనరులు ప్రజలందరికీ చెందాలని నాటి పోరాట యోధులు భావించారని, కానీ పాలకులు దేశంలోని కొంతమంది పెట్టుబడుదారులు, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను ధారాధత్తం చేస్తున్నారని విమర్శించారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి, పేదరికం,దారిద్ర్యం, నిరుద్యోగం ఉండడానికి కారణం భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకపోవడమే అని అన్నారు. పాలకులు ఆర్థిక సమానత్వాన్ని అందించే ఆదేశిక సూత్రాలను అమలు చేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
భారత రాజ్యాంగం ప్రసాధించిన స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను అమలు చేయకుండా నిర్బంధాలు, నియంతృత్వాలతో దేశాన్ని బానిస సమాజ దిశగా తీసుకెళుతున్న మతోన్మాదుల విధానాలను ప్రతిఘటించకపోతే బ్రిటిష్ వారి కాలంలో కంటే ఎక్కువగా బానిసత్వాన్ని అనుభవించాల్సి వస్తుందని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ కులం, మతం, ప్రాంతం, భాష, లింగం, జాతుల ఆధారంగా ప్రజల మధ్య విభజన, విద్వేష రాజకీయాలు సృష్టించి, చివరికి ప్రజల ఆచారాలు ఆహార వ్యవహారాలలో కూడా రాజకీయాలలో జోప్పించి దేశ అభివృద్ధి అడ్డుకుంటున్న పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముధం అరుణ్ రాజనర్సు పోచయ్య రాజేందర్ నాగరాజు భూపతిరెడ్డి రమేష్ బాలయ్య ఆశయ్య గంగారం రాజు రమేష్ కాశయ్య తదితరులు పాల్గొన్నారు.