calender_icon.png 4 July, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయసభలో రిజర్వేషన్లపై స్పష్టత నివ్వాలి

04-07-2025 01:08:56 AM

  1. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాడానికి కార్యాచరణ ప్రకటించాలి 
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ భేరి సభలో బీసీ రిజర్వేషన్ల పెంపు విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ర్టంలో కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో చేసిన రిజర్వేషన్ల బిల్లు, ఢిల్లీకి వెళ్లి మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపడం లేదని వాపోయారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ర్ట ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి ఒత్తిడి తీసుకురావడంతోపాటు జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభు త్వం మీద ఒత్తిడి పెంచాలని సూచించారు.

ఇందులో భాగంగా జూలై 21 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎజెండాగా ఉద్యమించడానికి మల్లికార్జున ఖర్గే స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినందున ఆ హామీని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందన్నారు.

ఈ బాధ్యతను జాతీయ అధ్యక్షులుగా మల్లికార్జున ఖర్గే తీసుకోవాలని, కాంగ్రెస్‌తోపాటు యూపీఏ పక్షాలన్నీ కలుపుకొని బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందే వరకు కేంద్రంపై పోరాడాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్ముతారని పేర్కొన్నారు.