calender_icon.png 5 July, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలేరు టెన్నల్ పనుల్లో అవకతవకలు

04-07-2025 09:13:10 PM

టెండర్ ప్రక్రియ లేకుండా పనులు ప్రారంభించడం ఏంటి

15 కోట్ల ఖర్చుపై  వివరాలు వెల్లడించాలి

బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు

అండర్ టర్నల్ నిర్మాణ పనులు పరిశీలించిన బిజెపి నేతలు

ఖమ్మం,(విజయక్రాంతి): పాలేరు సాగర్ ఎడమ కాలువ అండర్ టెన్నల్ నిర్మాణ పనులపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, టెండర్ ప్రక్రియకు విరుద్ధంగా కాంట్రాక్టులు అప్పగించారని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. శుక్రవారం పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా నాయకుల బృందం పాలేరు వద్ద జరుగుతున్న అండర్ టెన్నల్ పనులను పరిశీలించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది అకస్మాత్తుగా సంభవించిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అనుసంధానంగా ఉండే అండర్ టెన్నల్ కొట్టుకుపోయిన విషాద ఘటనను వారు గుర్తు చేశారు.

కాలువ తెగిపోవడం వల్ల ఆయకట్టు రైతులు పంటలు నష్టపోయారని, సాగు నిష్ప్రయోజనమై రైతులు అప్పుల్లో మునిగిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనుభవం మరువకముందే ప్రభుత్వం తగిన గమనిక తీసుకోకుండా మరోసారి అదే తప్పిదాన్ని పునరావృతం చేస్తుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతూనే, దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా మౌనాన్ని పాటిస్తోందని బీజేపీ విమర్శించింది. కాంట్రాక్టు పద్ధతిలో పనులను అప్పగించడంలో అనేక అనుమానాస్పద అంశాలున్నాయని నేతలు తెలిపారు.

పారదర్శకత లేకుండా టెండర్లను పక్కనపెట్టి ఇష్టానుసారంగా పనులను అప్పగించడం న్యాయపరంగా కూడా తప్పుపట్టదగిన చర్య అని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని, వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిస్థితి రైతులకు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశముందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నున్నా రవికుమార్,E V రమేష్, మందడపు సుబ్బారావు, రవి రాథోడ్, కోటమర్తి సుదర్శన్, హట్యా నాయక్ , గుత్తా వెంకటేశ్వరరావు, గడ్డం వెంకటేశ్వర్లు, పుణ్యవతి , పాగర్తి సుధాకర్ , జాటోత్ మధు నాయక్, బజ్జురి మల్లారెడ్డి, బెల్లం మురళి, గుండా ఉపేందర్ రెడ్డి, రజిని రెడ్డి,మణి, మేకల నాగేందర్, జ్వాలా గౌడ్, రవీందర్ తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు