04-07-2025 09:10:19 PM
2 కేజీల 350 గ్రాముల గంజాయి...
రెండు సెల్ ఫోన్ లను, ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం...
నిందితులను అరెస్టు చేసి రిమాండ్...
కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి
హుజూర్ నగర్: గంజాయి విక్రయించిన సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం హుజూర్ నగర్ సీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామశివారులో నలుగురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం శివారులో కాల్వపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గరిడేపల్లి ఎస్సై సలిగంటి శివ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
అక్కడ ముగ్గురు వ్యక్తులు గంజాయి పంచుకుంటున్నారని, వారి నుంచి 330 గ్రాముల గంజాయి ఒక పల్సర్ బైక్,సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన గణపవరపు శ్రీకాంత్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుసుకొని అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు.సదరు శ్రీకాంత్ నెల రోజుల క్రితం సీలేరు వెళ్లి కార్తీక్ వ్యక్తి నుంచి ఎనిమిది వేల రూపాయలతో నాలుగు కేజీల గంజాయిని కొనుగోలు చేసుకుని వచ్చినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన గంజాయిలో కొంత త్రాగి మరికొంత అమ్మినట్లు తెలిపారు.ఈ గత నెల 29న బోట్ల బాలకృష్ణ, షేక్ నజీర్, కొప్పుల శ్రీకాంత్ అనే వ్యక్తులకు విక్రయించినట్లు తెలిపారు. అదే వ్యక్తులకు శుక్రవారం కూడా 3000 రూపాయల విలువ గల గంజాయిని విక్రయించాడని తెలిపారు. కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులు గరిడేపల్లి మండలంలోని కాల్వపల్లి వెళ్లే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద తెచ్చిన గంజాయిని పంచుకుంటుండగా తమ సిబ్బంది పట్టుకున్నట్లు డిఎస్పి శ్రీధర్ రెడ్డి వివరించారు.
గంజాయిని పంచుకుంటున్న ముగ్గురు వ్యక్తుల్లో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట గ్రామానికి చెందిన బొట్ల బాలకృష్ణ,హుజూర్ నగర్ పట్టణంలోని పాత గోదాం బజారుకు చెందిన షేక్ నజీర్, గోవిందాపురంకు చెందిన కొప్పుల శ్రీకాంత్ లను గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్టుగా ఆయన తెలిపారు. చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన గణపవరపు శ్రీకాంత్ నుంచి రెండు కేజీల 30 గ్రాముల గంజాయిని, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం నలుగురు వ్యక్తుల నుంచి సుమారు 58 వేల 750 రూపాయల విలువగల రెండు కేజీల 350 గ్రాముల గంజాయిని, రెండు సెల్ ఫోన్ లను,ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకుని నిందితులను రిమాండ్ కు పంపించినట్లు ఆయన వివరించారు.
ఇటీవల కోదాడ సబ్ డివిజన్ పరిధిలో మాదకద్రవ్యాల కేసులు అత్యధికంగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఆదేశాలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు వాడటం ఎంత ప్రమాదకరమో తెలియచేసే విధంగా ఎన్నో ప్రదర్శనలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ గంజాయి విక్రయాలు జరగటం, కేసులు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా నివారించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాలని ఆయన కోరారు. యువత డ్రగ్స్ బారిన పడి గాడి తప్పుతున్నారని, చేతులారా తమ భవిష్యత్తును జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.