05-09-2025 01:14:49 PM
కోమటిరెడ్డి ప్రసంగాని అడ్డుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం
వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు
నాగం వర్షిత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు
విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బైటాయింపు
నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): నల్గొండలో శుక్రవారం గణేష్ శోభాయాత్ర(Ganesh Procession) ప్రారంభోత్సవం సందర్భంగా హనుమాన్ నగర్ 1వ నెంబర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనవాయితీ ప్రకారం పాతబస్తీ ఒకటో నెంబర్ గణేషుడి వద్ద పూజల అనంతరం శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) నగర ఉత్సవ సమితి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తన ప్రసంగం కొనసాగిస్తుండగా ఈ సందర్భంలో రాజకీయ మాటలు మాట్లాడొద్దని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి(Nagam Varshit Reddy) ఆందోళన చేపట్టారు. దీంతో బీజేపీ శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన నేపద్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు.
ఆ నేపద్యంలో కాంగ్రెస్,బీజేపీ(Congress, BJP) నేతల పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు నాగం వర్షిత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కనగల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బిజెపి కార్యకర్తలు అగ్ర కోశానికి లోనై పోలీస్ కార్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కార్యకర్తలను నెట్టేసి ముందుకెళ్లడంతో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపద్యంలో ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శోభయాత్ర వద్ద మరింత ఉదృత పరిస్థితి నెలకొంది. మంత్రి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవడంతో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు అనుమతించారు.
నాగం వర్షిత్ రెడ్డిని విడిచి పెట్టేదాకా ఇక్కడినుంచి కదిలేది లేదని ఒకటో నెంబర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Former MLA Kancharla Bhupal Reddy) బైఠాయించారు. దీంతో అధికారులు దిగివచ్చి నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేశారు. భారీ బందోబస్తు నడుమ 1వ నెంబర్ విగ్రహం శోభయాత్ర కొనసాగింది. తగ్గుతున్న లడ్డూ వేలం పాట.. హనుమాన్ నగర్ 1వ నెంబర్ గణపతి వేలం పాట గత సంవత్సరం నుండి తగ్గుకుంటూ వస్తుంది. 2023లో రూ. 36లక్షలు పాట పాడగా గత సంవత్సరం బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి రూ.13.50 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సంవత్సరం హనుమాన్ నగర్ కు చెందిన బొడ్డు పల్లి సతీష్ రూ. 5 లక్షల116 లకు పాట పడి లడ్డును దక్కించుకున్నాడు. రెండు సంవత్సరాల నుండి గణపతి లడ్డు తగ్గుముఖం పడడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.