calender_icon.png 7 September, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కుభీర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం

07-09-2025 07:10:35 PM

కుభీర్: నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు ముగిసింది. శ్రీ విఠలేశ్వర ఆలయం, యాదవ సంఘం, మున్నూరు కాపు సంఘం, అలాగే బృందావన్ కాలనీకి చెందిన వినాయక విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. హారతులు, భజనలు, కోలాటాలతో శోభాయాత్ర కొనసాగింది. భక్తులు గంగమ్మ ఒడికి వినాయక విగ్రహాలను తీసుకెళ్లి అక్కడ పూజలు జరిపిన అనంతరం పెద్ద ఆనకట్ట వద్ద నిమజ్జనం చేశారు. యువజన సంఘాలు, యువక మండళ్లు, కాలనీ వాసుల సహకారంతో శనివారం రాత్రంతా శోభాయాత్ర ఉత్సాహంగా కొనసాగి ఆదివారం ఉదయం ఘనంగా ముగిసింది. 

ప్రత్యేక ఆకర్షణగా బృందావన్ కాలనీకి చెందిన వినాయక విగ్రహాన్ని రంగురంగుల అలంకరణలతో, ఎడ్ల బండిపై ఉంచి, మహిళలు భజనలు, పాటలు, కోలాటాలు చేస్తూ శోభాయాత్రను నిర్వహించారు. చిన్నారులు, మహిళలు నృత్యాలతో సందడి చేశారు. ప్రధాన వీధుల గుండా సాంప్రదాయ పద్ధతిలో శోభాయాత్ర సాగడం మండల ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. అలాగే, పల్సిలోని శ్రీ విఠలేశ్వర, కాశీవిశ్వనాథ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినూత్నంగా ఎడ్ల బండిపై శోభాయాత్ర నిర్వహించిన బృందావన్ కాలనీ వాసులను మండల ప్రజలు అభినందించారు