19 April, 2026 | 2:08 AM

మళ్లీ హోర్ముజ్ మూసివేత

19-04-2026 12:31 AM
  1. ఓడరేవుల వద్ద అమెరికా దిగ్బంధంపై ఇరాన్ ప్రతిచర్య
  2. జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుందని స్పష్టీకరణ

వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ ౧౮: హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే, ఇరాన్ మళ్లీ జలసంధిని మూసివేసింది. ఇరాన్‌లోని ఓడరేవుల వద్ద అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడంతోనే మూసివేత నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. జలసంధిలో పూర్తి నియంత్రణ తమ దేశానిదే ఉంటుందని కూడా తేల్చిచెప్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూటకో వ్యాఖ్య చేస్తున్నారని, తాజాగా ఆయన ఒక గంట వ్యవధిలో ‘సుసంపన్నమైన యురేనియాన్ని అమెరికాకు ఇరాన్ అప్పగిస్తుంది. హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుంది.

ఇరాన్‌లోని అణు కేంద్రాల నుంచి అమెరికన్ యంత్రాలు యూరేనియాన్ని వెలికితీస్తాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగింపు దశకు వచ్చింది.. అమెరికా గెలిచింది. శాంతి ఒప్పందం కోసం ఇరాన్ నాయకత్వం దిగివచ్చింది. అమెరికాకు భయపడి ఇరాన్ 20 చమురు ట్యాంకర్లను జలసంధి నుంచి అనుమతించింది. ఇరాన్‌తో అమెరికా లావాదేవీలు సత్వరం ముగుస్తాయి’ అంటూ ఏడు రకాల వ్యాఖ్యలు చేశారంటూ ఎద్దేవా చేసింది. ఆ వ్యాఖ్యల్లో ఒక్కటైనా వాస్తవం లేదని కొట్టిపడేసింది. 

ఇరాన్ బ్లాక్‌మెయిల్: ట్రంప్

హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ విడుదల చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. జలసంధిని అడ్డం పెట్టుకుని ఇరాన్ తమకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నదని మండిపడ్డారు. తాము బ్లాక్ మెయిల్‌కు లొంగేది లేదని తేల్చిచెప్పారు. అంతకముందు ట్రంప్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు దిగిరాకపోతే, ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు.

తాజాగా ఆయన అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే బుధవారం లోపు ఇరాన్ బేషరతుగా శాంతి ఒప్పందానికి సిద్ధం కావాలని, లేదంటే కాల్పుల విరమణను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరిచినప్పటికీ తమ నౌకాదళ దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

౨ భారత నౌకలపై ఫైరింగ్

హోర్ముజ్ జలసంధి గుండా ౨౦ లక్షల బ్యారెళ్ల చమురు నిల్వలతో వెళ్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై శనివారం ఇరాన్ సైన్యం గన్‌బోట్లతో చుట్టుముట్టి ఫైరింగ్‌కు పాల్పడింది. ఈ అనూహ్యమైన పరిణామంతో భారత నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి మళ్లాయి. ప్రమాదంలో నౌకలో ఉన్న భారత నావికులకు ఎలాంటి హాని జరగలేదు. ఖేష్మ్, లారక్ దీవుల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు ప్రకటించాయి.

ఏ దేశానికి చెందిన నౌకనైనా సరే హోర్ముజ్ గుండా వెళ్లేందుకు అనుమతించబోమని ఇరాన్ ఉద్ఘాటించింది. మరోవైపు, నౌకలపై కాల్పుల ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. మరోవైపు, భారత విదేశీ వ్యవహారాలశాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రి కూడా ఫతాలీతో భేటీ అయ్యారు. భారత నౌకల రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని, ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.