09-08-2025 12:40:07 AM
-రెండు గంటల్లోనే 11 సెం.మీ వర్షం
-కాలువలుగా మారిన రోడ్లు , పొంగిపొర్లిన డ్రైనేజీలు
-నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
వలిగొండ,ఆగస్టు 8 (విజయక్రాంతి): వలిగొండ మండలంలో గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆకాశము ఒక్కసారిగా భారీ చల్లని గాలులతో నల్లని మబ్బులు కమ్మి ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగిందా అన్నట్లుగా భారీ వర్షం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో రెండు గంటలపాటు కురిసిన వర్షం 11 సెంటీమీటర్లుగా నమోదయింది. భారీ వర్షానికి రోడ్లన్నీ కాలువలుగా మారి ప్రవహించగా, డ్రైనేజీలు పొంగిపొర్లగా, పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అదేవిధంగా మూసీ ఎగువ ఎగువ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వలిగొండ మండలంలోని సంగెం వద్ద గల భీమలింగం కత్వ, నెమలికాలువ గ్రామంలో గల ఆసిఫ్ నగర్ కత్వ భారీ వరదతో పరవళ్ళు తొక్కుతున్నాయి. మండలంలో ఎటు చూసినా కాలువలు, వాగులు, వంకలు వరద నీటితో కళకళలాడుతుండగా వాటిలలో ప్రజలు చేపల వేటను కొనసాగిస్తున్నారు.