calender_icon.png 30 October, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి చర్యలు తీసుకోండి

29-10-2025 06:44:35 PM

- ఇకపై కేంద్ర పథకాలపై ప్రతినెల ప్రోగ్రె రిపోర్టును మీడియాకు రిలీజ్ చేయాల్సిందే

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ (విజయక్రాంతి): కలెక్టర్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి శాఖల వారీగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఉన్నతాధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశాన్ని నిర్వహించారు. విద్య, వైద్యం, ఆర్అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్, నేషనల్ హైవేస్, సోలార్, పరిశ్రమల శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై కేంద్ర పథకాలపై ప్రతినెల ప్రొగ్రెస్ రిపోర్టును మీడియాకు రిలీజ్ చేయాల్సిందేనని అన్నారు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా.. ప్రజలకు తెలియజేకపోతే ఎలా అని ప్రశ్నించారు. కరీంనగర్ పట్టణంలో యూజీడీ పనులు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, గుంతలు తవ్వి వదిలేశారని, నిధులన్నీ సర్వనాశనం చేశారన్నారు.

కష్టపడి నిధులు తీసుకువచ్చినా కరీంనగర్ కార్పొరేషన్లో ఎంపీ లాడ్స్ గ్రౌండ్లో జాప్యమేమిటని అన్నారు. ఎంసీకే అధికారుల నిర్లక్ష్యం సహించరానిదన్నారు. ఇకపై అమృత్ స్కీం పూర్తి పర్యవేక్షణ బాధ్యత కమిషనర్ తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాక కటై పొయ్యిపై ఎందుకు వండుతున్నారని అన్నారు. ఆర్అండ్ బి పనులు నత్తనడక పనులు చేస్తుంటే ఏం చేస్తున్నారని, కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయ్యి ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం ఇంకెంత కాలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం అల్లాడుతున్నా మీకు పట్టింపులేదా అని ప్రశ్నించారు. గన్నేరువరం నుండి బెజ్జంకి రోడ్డు పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం ఏమిటని, నిరంతరం అధికారులు ఎందుకు తనిఖీలు చేయడు లేదన్నారు.

ఆసుపత్రుల నిధులనీన్న దాదాపుగా కేంద్రమే ఇస్తోందని, అయినా ఆశించిన రిజల్ట్ లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలో ప్రజలకు మరింత వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని, మెడిసిన్ కూడా ఇవ్వకపోతే ప్రజలు బాధపడుతున్నారన్నారు. మెడిసిన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, మెడిసిన్ ఇవ్వకపోతే ప్రజలెందుకు వస్తారని ప్రశ్నించారు. ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు పంపిస్తే నేను సీఎస్సార్ నిధులు తెచ్చి మందులకు వెచ్చిస్తామన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారులు ట్రీట్మెంట్ తీసుకుంటే సామాన్యులకు కూడా భరోసా వస్తుందన్నారు.

కరీంనగర్ కలెక్టర్ ఆ పనిచేశారని, ఆమెను ఫాలోకావాలన్నారు. బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా విశ్వకర్మ, పీఎంఈజీపీ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని, తనాఖా లేకుండా 25 లక్షలలోపు రుణాలు ఇవ్వాలన్న కేంద్ర గైడ్ లైన్స్ ఉన్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. వెంటనే బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించాలని లీడ్ బ్యాంకు మేనేజరు ఆదేశించారు. తక్షణమే రిజల్ట్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనిపై తక్షణమే కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని, మాట వినని బ్యాంకుల వద్దనున్న డిపాజిట్లను వెనక్కు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు..