calender_icon.png 29 May, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నించిన నాయకుల ప్రాణాలు తీశారు.. అక్రమ కేసులు పెట్టి వేధించారు

27-05-2025 03:51:48 PM

అమరావతి,(విజయక్రాంతి): మహానాడు ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహా పండుగను టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మహానాడు ప్రాంగణంలో టీడీపీ జెండా ఎగురవేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని మాట్లాడిన వారి పని అయిపోయిందే కానీ, పార్టీ మాత్రం వెనక్కు తిరిగి చూడలేదని పేర్కొన్నారు. ఈ జెండా ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుందని,  "వాట్ ఏపీ థాంక్స్ టుడే, ఇండియా థాంక్యూ టుమారో." అనే విధంగా మన ప్రస్థానం సాగిందని తెలిపారు.

చైతన్యరథం నుంచి వస్తున్నా మీకోసం, యువగళం వరకు పార్టీ కార్యకర్తల్లో అదే స్ఫూర్తి. గత ప్రభుత్వం పాలన అంటే వేధింపులు, తప్పుడు కేసులని మార్చేసిందని ఎద్దేవా చేశారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రశ్నించిన నాయకులను వెంటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారని, ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారే తప్ప వెనుకడుగు వేయలేదని హర్షం వ్యక్తం చేశారు. పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలేశారని సభ ముఖంగా గుర్తు చేసుకున్నారు. ఆశయ సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పారు. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇచ్చి సంక్షేమం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  

పోలవరం పూర్తిచేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరిస్తామని, తెలుగుదేశం పార్టీ సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతిపై వ్యతిరేక పోరాటం చేశామని,  అధికారంలో ఉంటే నీతివంతమైన పాలన అందిస్తున్నారమని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నామని, సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తూ పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. మనరాష్ట్రంలో బలమైన యువశక్తి ఉందని, వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారు. అన్నిరంగాల్లో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే యువగళం లక్ష్యమన్నారు.