27-05-2025 11:17:37 PM
11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
మహారాష్ట్రలోనూ జోరుగా వానలు..
తిరువనంతపురం/ముంబై: వారం ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం కేరళలోని చాలా ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. రానున్న 24 గంటల్లో కేరళలోని కాసర్‌గోడ్, వయనాడ్, కోజిగోడ్, పాలక్కడ్, త్రిసూర్, ఇడుక్కి, ఎర్నాకులం, కొట్టాయం, కన్నూర్, మలప్పురం, పతన్‌మిహిట్టా జిల్లాలకు భారీ వర్షన సూచన ఉండడంతో రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసినట్టు కేరళ వాతావరణ విభాగం(Kerala Meteorological Department) తెలిపింది.
ఇక తిరువనంతపురం, కొల్లామ్, అలప్పుజకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా త్రిసూర్‌గురువాయర్ లైన్‌లో అన్ని రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇక మహారాష్ట్రలోనూ వానలు జోరుగా కురుస్తున్నాయి. సోమవారంతో పోలిస్తే వర్ష ప్రభావం కాస్త తక్కువే అయినప్పటికీ రానున్న రోజుల్లో ముంబై సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ మేరకు ముంబైకి యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ కొల్హాపూర్‌కు రెడ్, పూణేకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షం కారణంగా పూణేలో చెట్టు కూలి ఒకరు మృతి చెందారు.