23-11-2025 11:46:46 AM
హైదరాబాద్: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హిల్ వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. సత్యసాయి జయంతి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, ఛత్తీస్ గఢ్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. అంతకుముందు స్వర్ణ రథంపై శ్రీ సత్యసాయి బాబా చిత్రపటాన్ని ఊరేగింపుగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని, ఒక ఉద్దేశంతో లోకానికి వచ్చి దాని కోసమే జీవించారని పేర్కొన్నారు. సత్యసాయి బాబా మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారని, ఆయన తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని గుర్తు చేసుకున్నారు. క్రమ శిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయి చెప్పారని, మానవ రూపంలో మనం చూసిన దైవస్వరూపం శ్రీ సత్యసాయి సీఎం అన్నారు. సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మనం మరోసారి స్మరించుకుందామని చంద్రబాబు చెప్పారు.
సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారు. 1960లో బాబా శ్రీ సత్యసాయి బాబా సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యేక్షంగా నిరూపించారని, సకల జనుల సంక్షేమాన్ని సత్యసాయి బాబా కోరుకున్నారు. దేశ, విదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయి బాబాను దర్శించుకున్నారని, దీంతో భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని, బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి వచ్చి సేవలో భాగమయ్యారు.
సత్యసాయిబాబా ట్రస్టు ద్వారా సేవలను ప్రపంచవ్యాప్తం చేశారని, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వర్థ సేవలకు నిలువెత్తు రూపమయ్యారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. 102 సత్యసాయి పాఠశాలల్లో 60 వేల మంది చదువుతున్నారని, ట్రస్టు ఆసుపత్రులో ద్వారా రోజుకు 3 వేల మందికి పైగా రోగులకు చికిత్స అందుతోందని సిఎం తెలిపారు. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.550 కోట్లు ఖర్చు పెట్టి నీరందించారని, సత్యసాయి బాబా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచదేశాల్లో సాయి సేవలను ముందుకు తీసుకెళ్తోందన్నారు.