28-05-2025 11:33:01 AM
ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన చంద్రబాబు
తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్
హైదరాబాద్: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu ) అన్నారు. కడపలో రెండవ రోజు మహానాడు ప్రతినిధుల సభ జరుగుతోంది. ఎన్టీఆర్ జయంతి( NTR Birth Anniversary) సందర్భంగా మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండగ రోజని పేర్కొన్నారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదని చంద్రబాబు తెలిపారు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ ఎవరెస్టుగా ఎదిగారని కొనియాడారు. నీతి నిజాయితీ, పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలు అన్న ఆయన ఎన్టీఆర్ ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు అన్నారు.
నటుడిగా 33 ఏళ్లు.. రాజకీయాల్లో 13 ఏళ్లలో అద్వితీయ చరిత్ర సృష్టించారని వెల్లడించారు. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా.. రైతులకు నేస్తం.. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. అధికారం అంటే బాధ్యత.. పదవి అంటే సేవ అని నిరూపించారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజలకు ఎన్టీఆర్ గుర్తు ఉంటారని తెలిపారు. తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భరోసా.. టీడీపీ(Telugu Desam Party) జెండా అని సీబీఎన్ సూచించారు.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త ఒరవడి సృష్టించారని చెప్పారు. 2047 నాటికి తెలుగుజాతిని ప్రంపంచలోనే అగ్రస్థానంలో ఉంచాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే 40 ఏళ్లకు రోడ్ మ్యాప్ నకు రూపకల్పన చేసుకున్నామన్నారు. నా తెలుగు కుటుంబం కోసం 6 శాసనాలు చేసుకున్నామని, మళ్లీ జన్మ ఉంటే తెలుగు జాతి కోసం తెలుగుగడ్డపైనే పుడతానని చంద్రబాకు స్పష్టం చేశారు. కార్యకర్తే అధినేత.. కార్యకర్తలే సుప్రీం.. ఇది పార్టీ సిద్ధాంతం అన్నారు.కడప మహానాడులో రెండో రోజు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పించారు. అశోక్ గజపతిరాజు యుగపురుషుడికి నివాళి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, టిడి జనార్ధన్ బలపరిచారు.