04-08-2025 12:26:59 PM
హైదరాబాద్: దేశం గర్వించదగిన గిరిజన నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్(Shibu Soren Passes Away) మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) తీవ్ర సంతాపం తెలియజేశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పరిష్కారంలో మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబు సోరెన్ అని ముఖ్యమంత్రి కొనియాడారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరులోనూ శిబు సోరెన్ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శిబుసోరెన్ మొదటి నుంచి మద్దతుగా నిలిచారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైతం చివరి వరకు ఆయన బలమైన వాదన వినిపించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
ఆదివాసీ సమాజానికి గురూజీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఎనిమిది సార్లు లోక్‌సభ ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. శిబు సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.