04-08-2025 12:19:02 PM
నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు రాష్ట్రంలోనే మొదటి స్కూల్ కావాలి
రాష్ట్ర రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమమైన చదువులను అందించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలన్నారు. 9 నెలల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.
సోమవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని గంధం వారి గూడెంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల(Young India Integrated Residential School) పనులకు మంత్రి భూమి పూజ నిర్వహించారు.నల్గొండ జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చేపట్టిన బృహత్తర పాఠశాల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల అని, రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలతో ఇలాంటి పాఠశాలలను డిజైన్ చేసి నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే నల్గొండ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల మొదటిదని, ఇది రికార్డు కావాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తో పోటీపడి ఈ పాఠశాల నిర్మాణాన్ని అంతకన్నా బాగా తీర్చిదిద్దాలని చెప్పారు.రెసిడెన్షియల్ పాఠశాల పక్కనే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఉన్నాయని, నల్గొండ లో అన్ని హంగులతో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉందని, నల్గొండ జిల్లాను విద్యా హబ్ గా మార్చడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఇటీవలే ఎం ఫార్మసీ ,ఎల్ఎల్ బి కోర్సులు మంజూరు చేయించడం జరిగిందన్నారు.
భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ హాబ్(Education hub) గా తీర్చిదిద్దుతామన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలని, మధ్యలో బడి మానివేయవద్దని అన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారని, వారందరినీ ఇలాంటి ఉత్తమమైన పాఠశాలల్లో చదివించి వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, విద్య ,ఉపాధిలో తెలంగాణ ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోనిలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంతున్నదని తెలిపారు. ప్రస్తుతం నల్గొండలో బాలికలకు ఉద్దేశించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు కాగా, బాలురకు కూడా ఇలాంటి పాఠశాలనిర్మాణానికిచర్యలుతీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,టి జి ఈ డబ్ల్యు ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, విద్యాశాఖ అధికారి బిక్షపతి, టి జి ఈ డబ్ల్యు ఐడిసిడిఈ శైలజ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.