10-11-2025 01:39:55 AM
6.8 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో, నవంబర్ 9: భూకంప ప్రభావం తో ఆదివారం జపాన్ ఉత్తర తీరం వణికిపోయింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం 6.8 తీవ్రతతో నమోదైంది. ఇవాటే ప్రిఫెక్చర్ ఉత్తర తీరంలో 10 కిలో మీటర్ల (6.2 మైళ్లు) లోతులో భూకంపం సంభవించిందని జపాన్ మెటిరోలాజికల్ ఏజెన్సీ (జేఎంఏ) వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు బయటకు వెళ్లవద్దని ఏ క్షణంలోనైనా అలలు సమీపించవచ్చని అధికారులు హెచ్చరించారు.
భూకంపాల తర్వాత వచ్చే సునామీ అలలు కొన్ని గంటల పాటు కొనసాగవచ్చని, పదే పదే తీరాన్ని తాకవచ్చని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొదటి సునామీ స్థానిక సమయం సాయంత్రం 5:37 గంటలకు ఇవాటేలోని మియాకోను తాకింది.
కానీ అది చాలా చిన్నదిగా ఉండటం వలన జపాన్ వాతావరణ సంస్థ ఎత్తును కొలవలేమని తెలిపింది. రెండు నిమిషాల తర్వాత, మరొక సునామీ అల ఇవాటే ప్రిఫెక్చర్లోని ఒఫునాటో నగరాన్ని చేరుకుందని జేఎంఏ తెలిపింది. దీని ఎత్తు 10 సెంటీమీటర్లు (సుమారు 4 అంగుళాలు)గా కొలవబడింది. ఈ సునామీ ఒమినాటో పోర్ట్, మియాకో, కమైషిని కూడా తాకిందని తెలిపింది.
అండమాన్ దీవుల్లో సైతం
అండమాన్, నికోబార్ దీవుల్లో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవిం చింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది. 10కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. అయితే, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ మాత్రం దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా రికార్డు అయినట్లు వెల్లడించింది. పోర్టుబ్లెయిర్‌కు ఈశాన్యంగా 147కి.మీ దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.