calender_icon.png 27 September, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాలు ఉన్నప్పటికీ.. యువతలో స్కిల్స్ లేవు

27-09-2025 01:37:25 PM

  1. రాష్ట్రం వచ్చాక పదేళ్లు గడిచినా.. యువత ఆకాంక్షలు నెరవేరలేదు
  2. చదువు, సాంకేతిక నైపుణ్యం.. మన తలరాతను మారుస్తాయి
  3. గంజాయి కేసుల్లో అధికంగా ఇంజినీరింగ్ విద్యార్థులే

హైదరాబాద్: హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రారంభించారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు అవసరమని భావించామన్నారు. యువతతో నైపుణ్యాల పెంపు కోసం టాటా టెక్నాలజీస్ తో చర్చలు జరిపామని పేర్కొన్నారు.

టాటా టెక్నాలజీస్(Tata Technologies)తో సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి(ATC development) చేశామన్నారు. ఆటో మొబైల్ ఇండస్ట్రీలో(Automobile Industry) విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని సీఎం సూచించారు. ఉద్యోగాలు ఉన్నప్పటికి పరిశ్రమలకు అమసరమైన స్కిల్స్ యువతలో లేవని తెలిపారు. తెలంగాణలో స్కిల్స్ ఉన్న ఉద్యోగులు దొరకడం లేదని ఆటో మొబైల్ వ్యాపారులు అన్నారని చెప్పారు. రూ. 2400 కోట్ల వ్యయంతో 65 ఏటీసీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఒక్కొక్క ఏటీసీలో దాదాపు 200 మంది ప్రవేశాలు పొందుతున్నారని వివరించారు. ఏటీసీల్లో శిక్షణ(ATC training) పొందుతున్న అందరికీ ఉద్యోగాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో మరో 51 ఏటీసీలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. 

నిరుద్యోగుల పోరాటం వల్లే మనకు తెలంగాణ సాకారం అయిందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్ర వచ్చాక పదేళ్లు గడిచినా యువత ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. కేవలం సాఫ్ట్ వేర్ కోర్సులతోనే(Software course) విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని అనుకోవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. ఏటీసీలో శిక్షణ పొంది జర్మనీలో ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారని తెలిపారు. జర్మనీలో నెలకు రూ. 3.50 లక్షలు జీతం వచ్చే ఉద్యోగాలు సంపాదించారని కొనియాడారు. చదువు, సాంకేతిక నైపుణ్యం మాత్రమే మన తలరాతను మారుస్తాయని చెప్పారు. సాంకేతిక నైపుణ్యాలు లేకపోతే ఈ రోజుల్లో దేనికి కొరగాని పరిస్థితి ఉందన్నారు. గంజాయి కేసుల్లో అధికంగా ఇంజినీరింగ్ విద్యార్థులే(Engineering students) దొరకటం దురదృష్టకరం అన్నారు. బీటెక్ విద్యార్థులు(B.Tech students) గంజాయికి బానిసలై తల్లిదండ్రులకు క్షోభ కలిగించవద్దని హెచ్చరించారు. ఏటీసీలో శిక్షణ పొందే వారికి ప్రతినెల రూ. 2 వేలు స్టైఫండ్ ఇచ్చే ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు.