calender_icon.png 27 September, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

27-09-2025 02:29:19 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుండి జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్  సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అనుకుంటేనే తప్ప ఇండ్ల నుండి బయటకు రాకూడదని ప్రజలకు సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రాబోయే రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, జిల్లా పరిధిలో వర్షం కారణంగా ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించవలసిన ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలు, చెరువులు, ట్యాంకులు, శిథిలమైన ఇళ్ళు వద్ద ప్రజలకు ఏవైనా సమస్యలను ఉంటే పరిశీలిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నది ప్రవాహక ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నదులు, చెరువులు ప్రవహించే ప్రాంతాలలో ప్రజల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వేలాడుతున్న విద్యుత్ వైర్లను గమనిస్తూ, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గమనిస్తూ ఉండాలని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  అత్యవసర పరిస్థితులలో తక్షణమే స్పందించడానికి ప్రధాన కార్యాలయంలో అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ, ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.