27-09-2025 02:30:44 PM
వరంగల్ ఎంపీ కడియం కావ్య
హనుమకొండ,(విజయక్రాంతి): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, అందించిన సేవలు చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రముఖ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.... స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
స్వాతంత్ర్య, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దేశానికి బాపూజీ మహాత్మా గాంధీ అని, తెలంగాణ కు బాపూజీ కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాల తరువాత బీసీ కులగణనకు రాష్ట్రంలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపీతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. బీసీలకు ప్రభుత్వం ఎలాంటి ఉందని, ప్రభుత్వానికి అండగా బీసీలు అండగా నిలవాలని పేర్కొన్నారు. బీసి భవన్, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటు కు ప్రతిపాదనలిస్తే ఎమ్మెల్యే తో కలిసి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బీసి భవన్ ఏర్పాటు కు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, ఇతర శాఖల అధికారులతో పాటు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద మల్లయ్య, నాయకులు గడ్డం కేశవమూర్తి, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.