15-08-2025 10:42:31 AM
హైదరాబాద్: పేదల సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తున్నామని, సంక్షేమానికి కేరాఫ్ అంటే కాంగ్రెస్ పాలన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy ) స్పష్టం చేశారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ(Independence day 2025) వేడుకలు రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... అహింసా పద్ధతిలో మహాసంగ్రామన్ని గెలిచామని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో(Freedom struggle) ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామన్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందని గుర్తుచేశారు. దేశ భవిష్యత్ మనల్ని పిలుస్తోందని నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయం అన్నారు. నెహ్రూ(Jawaharlal Nehru) స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారని చెప్పారు. నాటి ప్రధాని నెహ్రూ కేవలం ప్రసంగాలతో సరిపెట్టలేదని, పటిష్ఠ భారత్ కోసం ఎన్నో చర్యలను చేపట్టారని తెలిపారు.
మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని చెప్పారు. ఆనాడు పెద్దలు వేసిన పునాదులతోనే నేడు దేశం సుసంపన్నంగా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలతో సాగుతోందని సూచించారు. ప్రపంచ నగరాలతో పోటీ పడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. సన్నబియ్యం పథకం కేవలం ఆకలితీర్చే పథకం కాదన్న ఆయన సన్నబియ్యం పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీకని తెలిపారు.