calender_icon.png 15 August, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాప్రభుత్వం వచ్చాకే.. పేదల సమస్యలు పరిష్కారం

15-08-2025 11:01:16 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాకే పేదల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) తెలిపారు. గోల్కొండ కోటలో శుక్రవారం నాడు స్వాతంత్య్ర దినోత్సవ(Independence day 2025) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ...  రేషన్ షాపులు పేదవాడి ఆకలి తీర్చే భరోసా కేంద్రాలుగా మారాయని చెప్పారు. గతేడాది ఆగస్టు 15న రూ. 2 లక్షల రుణ మాఫీకి శ్రీకారం చుట్టామన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని సగర్వంగా నిలబడ్డామని తెలిపారు. విత్తనాలు వేసేనాటికే రైతుల ఖాతాల్లో రైతుభరోసా ఇచ్చామని పేర్కొన్నారు. పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్లు వేశామని చెప్పారు. రైతు పండించిన చివరిగింజ వరకు ధాన్యం సేకరిస్తున్నామని తెలిపిన సీఎం రేవంత్  ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు వేశామని చెప్పారు.

రాష్ట్రంలో 78 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రైతులు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపారని కొనియాడారు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించామని వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్, కోయిల్ సాగర్ తో వరి పండిస్తున్నామని వివరించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు సొంతింటి కలను దూరం చేసిందని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని చెప్పారు. సామాజిక కుల, ఆర్థిక, రాజకీయ, విద్య సర్వేను ఒక యజ్ఞంలా చేశామన్నారు. సామాజిక సర్వే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని తెలిపారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి 2న బిల్లులు తెచ్చాం.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతున్నామని సీఎం వెల్లడించారు. బీసీ బిల్లులను త్వరగా ఆమోదించాలని గోల్కొండ కోటపై నుంచి సీఎం రేవంత్ మరోసారి విజ్ఞప్తి చేశారు.