15-08-2025 11:11:11 AM
రాష్ట్ర ఐ.టి, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
కరీంనగర్,(విజయక్రాంతి): మనం సాధించుకున్న స్వాతంత్య్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నామని రాష్ట్ర ఐ.టి, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) అన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ పోలీస్ పరేడు మైదానంలో జాతీయ పతాకాన్ని(Independence Day ) ఆవిష్కరించారు. ఈ సందర్బంహ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... 70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి ‘‘సన్న బియ్యం’’ పంపిణీని ప్రారంభించిందన్నారు.
13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డు... ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా...భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామని పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో... రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోందన్నారు. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశామని ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా... రైతుల విషయంలో రాజీ పడలేదని తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించామన్నారు.
‘‘ఇందిరమ్మ రైతు భరోసా’’ కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించామని పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశామని జూన్ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించామని కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించా మన్నారు. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నామని సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామని ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నామని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు.
తొలి విడతగా ఇందిరమ్మ ఇళ్ళు
ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. గ్రీన్ ఛానెల్ లో నిధులు విడుదల చేస్తున్నాం. ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నాం
42 శాతం కి కట్టుబడి ఉన్నాం
స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్- 1 లో 15, గ్రూప్-2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం. ఆరోగ్య శ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీం. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం.
మహాలక్ష్మి క్రింద ఉచిత ప్రయాణం
ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది. యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
కృష్ణా, గోదావరి జలాల వాటా సాధిస్తాం
తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండిరగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే... శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు.. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో ఉన్నాం