12-01-2026 04:02:11 PM
ఉద్యోగులే మా సారథులు, వారధులు.
ఇప్పటి వరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదు.
హైదరాబాద్: ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపేది 10.50 లక్షల మంది ఉద్యోగులని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరని తెలిపారు. ఉద్యోగులు సరిగా పనిచేయడం వల్లే పథకాలు సరిగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులే మా సారథులు, వారథులన్నారు.
గత ప్రభుత్వం వదిలివెళ్లిన అప్పులు తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఒక్క సెలవు కూడా తీసుకోలేదన్నారు. సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటానని వివరించారు. ఏదో పని వచ్చి సెలవు తీసుకోవడం కుదరట్లేదన్నారు. ఉద్యోగుల్లో కూడా నేను నచ్చనివారు చాలా మంది ఉండవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను వచ్చాక ఉద్యోగుల జీతాలు ఎలా వస్తున్నాయో వీరే గమనించాలని చెప్పారు. ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ. కోటి బీమా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఉద్యోగులు జమ చేసిన సొమ్ముకు తాము కాపలాదారు మాత్రమే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ. 12 వేల కోట్ల మేర పెండింగ్ ఉన్నాయన్నారు. పన్ను వసూళ్లలో అవకతవకలు అరికడితే కావాల్సిన నిధులు వస్తాయని చెప్పారు. పన్నులు పెంచాల్సిన అవసరం లేదు.. సరిగా వసూల్లు చేస్తే చాలన్నారు. చాలా మందిని పన్ను కట్టాలని ఉద్యోగులను అడగట్లేదన్నారు. త్వరలో జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తోందన్నారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయని సూచించారు. రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదని మార్చామన్నారు. రాచకొండ పేరు.. రాచరిక పాలనకు గుర్తుగా ఉందని మార్చామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.