12-01-2026 06:54:04 PM
అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీనారాయణ
గద్వాల: మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు. మున్సిపల్ ఎన్నికలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం పై సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఎలక్ట్రోరల్ వార్డుల వారీగా ఫైనల్ పబ్లికేషన్ ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన ప్రక్రియ నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని ఆదేశించారు. యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రస్తుతం 79 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస నిర్మాణం, పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేలా, సైన్స్ ఫెయిర్స్ లో ప్రతిభ చాటేలా, క్రీడా, తదితర రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే ఈ పాఠశాలలను ప్రారంభించేలా భవనాల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ పాఠశాలల నిర్మాణంపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిర్ణీత సమయంలోగా పూర్తి అయ్యేలా సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ ఉండాలన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... గద్వాల నియోజకవర్గంలో కేటి దొడ్డి మండల కేంద్రంలో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఇప్పటికే టెండర్ పూర్తయిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ఫైనల్ ఎలక్ట్రోరల్ జాబితా పబ్లికేషన్ పూర్తిచేసి, ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు, టీజీ ఈడబ్ల్యూఐడీసీ డిఈఈ వెంకట్ రెడ్డి, ఏఈ మోహన్ రెడ్డి, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.