తక్షణమే సహాయక చర్యలు

08-05-2024 02:18:03 AM

విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించండి

లోతట్టు ప్రాంతవాసులకు సహాయం చేయండి

ట్రాఫిక్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేయండి

జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీసు అధికారులకు సీఎం ఆదేశం 

భారీ వర్షం, ఈదురు గాలులపై సమీక్ష 

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం జనజీవనం అస్తవ్యస్థం కావటంతో అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం అక్కడి నుంచే జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస్‌రెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈదురుగాలులతో నగరంలో చాలా చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను వీలైనంత త్వరగా క్లియర్ చేసి.. వాహనాదారులు వారి ఇళ్లకు వెళ్లేలా చూడాలని కోరారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.