23-12-2025 08:03:03 PM
రోడ్ ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కల్పించాలి
ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీస్, ట్రాన్స్పోర్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– జిల్లా పాలనాధికారి ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు ప్రణాళికలతో యువత, విద్యార్ధులు, ప్రజలలో అవగాహన కల్పించాలని మంగళవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సంగ్వాన్ ట్రాన్స్ పోర్ట్ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లాలో ఆటో రిక్షాల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా రవాణా అధికారికి కీలక సూచనలు చేశారు.
ఆటో రిక్షాలలో పెద్దవారు ముగ్గురికి మించి ప్రయాణించరాదని, అలాగే పిల్లలు ఆరుగురికి మించి ఎక్కించకూడదని స్పష్టం చేశారు. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలని, డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఆదేశించారు. ఆటో నడుపుతున్న సమయంలో డ్రైవర్ పక్కన ఎవరూ కూర్చుని ప్రయాణించరాదని హెచ్చరించారు.
నిర్దేశించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినా, అవసరమైన ధ్రువపత్రాలు లేకపోయినా సంబంధిత వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితంగా ప్రయాణిస్తున్నారా అనే విషయాన్ని గమనించాలని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాఠశాలకు ఎలా వస్తున్నారు తెలుసుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రహదారి భద్రత నియమాల అమలుకు రవాణా శాఖకు సహకరించాలని కోరారు.