26 April, 2026 | 6:05 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

బీజేపీ మాటలు నమ్మి రాష్ట్రాన్ని ఆగం చేయొద్దు

10-05-2024 07:45 PM

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సంచనల వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థికి మద్దతుగా సిఎం రేవంత్ షాద్ నగర్  రోడ్ షో నిర్వహించారు.  ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...  మళ్లీ 70 ఏళ్ల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా బిడ్డకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాలేదన్న ఆయన సమైక్యాంధ్ర పాలకులు పాలమూరు జిల్లాను ప్రాజెక్టులను పడావు పెట్టారని ఆరోపించారు. సమైక్యాంధ్ర పాలకుల కంటే.. కేసీఆర్ ఎక్కువ అన్యాయం చేశారని పేర్కొన్నారు. నారాయణపేటకు వచ్చిన ప్రధాని మోడీ మనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు. జిల్లాకు ఏమైనా నిధులు, ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశించానని చెప్పారు. ఏదీ ప్రకటించపోగా 100 రోజుల ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 100 రోజుల్లో ప్రభుత్వం అవినీతి ఎలా చేయగలుగుతుందని ఆయన ప్రధానిని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు ఆషామాషీ కావు అని పేర్కొన్నారు. హైదరాబాద్ తొలి సిఎంగా షాద్ నగర్ బిడ్డ బూర్గుల రామకృష్ణరావు ఉన్నారు. కొన్నేళ్లుగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కీలక పదవులు కూడా దక్కలేదన్నారు. సారా, ఇసుక, కంకర దోపిడీదారులను పక్కన పెట్టుకుని మోడీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

డీకే అరుణ, రేవంత్ రెడ్డిలో ఎవరు అవినీతిపరులో ఓటింగ్ పెడదామా? అన్న సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని హోదాలో ఉండి ఆరోపణలు చేసేటప్పుడు నిజాలు కూడా తెలుసుకోవాలని హితువు పలికారు. ప్రధాని మోడీ.. పాలమూరు జిల్లా ప్రజలను అవమానించారని సిఎం చెప్పారు. చీకటైతే.. బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటేనని పేర్కొన్నారు. దొంగలెవరో.. దొరలెవరో ప్రజలకు తెలుసన్నారు. బిఆర్ఎస్ నేతలు బిజెపికి అమ్ముడుపోయారని ఎద్దేవా చేశారు.  బిడ్డ బెయిల్ కోసం కెసిఆర్ తన పార్టీని మోడీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. అభివృద్ధి జరగాలన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ కు ఓఆర్ఆర్, విమానాశ్రయం, పరిశ్రమలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఓఆర్ఆర్, విమానాశ్రయం పరిశ్రమలు వచ్చాకే.. రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పెరిగాయని చెప్పుకొచ్చారు. మత కల్లోహాలు లేవు కాబట్టే హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగిందని తెలిపారు. హైదరాబాద్ ఖ్యాతి గుజరాత్ కంటే ఎక్కువగా పెరిగిందని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ మతచిచ్చు పెట్టి శాంతిభద్రతలు చెడగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు వచ్చే పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలనేది బిజెపి కుట్ర అన్నారు. మతసామరస్యాన్ని కాపాడేవాడే అసలైన హిందుకు.. దేవుడి పటాన్ని నడిరోడ్డులో పెట్టి ఓట్లు అడుక్కునే వాడు హిందువా? అని ప్రశ్నించారు. బిజెపి పాలిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ కు ఎందుకు పెట్టుబడులు రావటం లేదో తెలుస్తా..? ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదని సూచించారు. బిజెపి వాళ్ల మాటలు నమ్మి రాష్ట్రాన్ని ఆగం  చేసుకోవద్దని సిఎం ప్రజలను కోరారు. గుజరాత్ బాగుండాలి.. పెట్టుబడులురావాలి.. హైదరాబాద్ లో కత్తులతో పొడుచుకోవాలనేది బిజెపి కుట్ర అని సిఎం వివరించారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో తెస్తా.. ఆ తర్వాత షాద్ నగర్ కు తెస్తానని సిఎం తెలిపారు. ముదిరాజ్ లను బిసి-ఏలో చేర్చేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాలమూరు బిడ్డకు, ఢిల్లీ సుల్తాన్ లకు మధ్య జరుగుతున్న పోరు ఇదన్నారు. షెడ్డుకు పోయిన కారు.. మళ్లీ తిరిగిరాదు చెప్పాను.. కారు పనికిరాకుండా పోయినందునే.. బస్సెక్కి తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.