calender_icon.png 24 May, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే

24-05-2025 01:09:19 AM

-కాలేశ్వరం కూలిపోతే చెరువు ఎట్లా నిండాయి 

-కెసిఆర్ హయాంలోనే కరెంటు బాధలు నీళ్లగోస తీరింది 

-మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 

సిద్దిపేట, మే 23 (విజయక్రాంతి): కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అంటూ అబద్ధ ప్రచారం చేస్తున్న వారు సిద్దిపేటకు రండి, ఇక్కడ నిండిన చెరువులు చూడండి, వేసవికాలంలో చెరువులు మత్తడి పారుతున్నాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు విప్పితే అబద్ధాలే మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు.

శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించిన ఆయన గ్రామదేవతల ఉత్సవాలలో పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ హయాంలోని కరెంటు బాధలు, మంచినీళ్ల గోసలు తీరాయని చెప్పారు. దుబాయ్, బొంబాయి వలస వెళ్లి వచ్చాక బోరు వేసుకునే పరిస్థితి నుంచి కాలువల ద్వారా చెరువులు నింపి భూగర్భ జలాలను పెంచిన ఘనత కెసిఆర్ కి దక్కిందన్నారు.

మనుషుల్లో మానవత్వాన్ని తట్టి లేపి మంచిని పెంచే దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాడు రాముడు మనవాడే అనే వాళ్ళు నేడు హరీష్ మా వాడే అంటుంటే సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట వెంకటేశ్వర ఆలయం స్వర్ణోత్సవాలు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణ నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

సమాజ శ్రేయస్సు కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. యాదవ సమాజంలో ఉన్న పేద విద్యార్థులకు సాయం చేసేందుకు యాదవ సంఘం కృషి చేయాలని చెప్పారు. శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.