23-11-2025 06:29:09 PM
హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ కోసం మీర్‌ఖాన్‌పేట్‌లో జరుగుతున్న ఏర్పాట్లను సీఎం రేవంత్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు.
వివిధ దేశాల రాయబారులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని, సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. పాస్‌లు లేని వారిని, సమ్మిట్‌తో సంబంధం లేని వ్యక్తులను ప్రాంగణంలోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. శాఖల వారిగా నియమించబడిన అధికారులను మాత్రమే లోపలికి అనుమతించాలని.. పార్కింగ్, భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పోలీసులకు ఎటువంటి సమస్యలు తలెత్తకూడదని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా సీఎం రేవంత్ పరిశీలించారు.