calender_icon.png 14 May, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యపు రాశులను వదిలి.. అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారు

13-05-2025 11:47:57 PM

రైతులను పట్టించుకోని సీఎం..

మాజీ మంత్రి హరీశ్‌రావు..

హైదరాబాద్ (విజయక్రాంతి): ధాన్యపు రాశులను గాలికి వదిలేసి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని, రైతులు పంటలు అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నా పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. వేలాది మంది పోలీసులు, అధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారుగానీ, దేశానికి అన్నం పెట్టే రైతు కష్టం తీర్చడానికి సీఎంకు సమయం లేకపోవడం దురదృష్టకరమన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నదని, లారీలు లేక కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరడం లేదన్నారు. తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతోందని, మిల్లర్లు తక్కువ ధాన్యాన్ని చూపుతూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. అనేక జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పాకిస్థాన్ నమ్మి అప్పు ఇస్తున్నారుగానీ, సీఎం రేవంత్‌ను నమ్మి అప్పు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతుల కష్టాలను తీర్చాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.