calender_icon.png 1 December, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ వైఫల్యాలు ప్రశ్నిస్తున్నందుకే ఈడీ వేధింపులు

01-12-2025 08:42:31 PM

* రాహుల్ గాంధీపై చర్యను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్

* హుస్నాబాద్‌ లో సీఎం సభ ఏర్పాట్లు పరిశీలన

* 2047 విజన్‌తో రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నామని వెల్లడి

హుస్నాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3వ తేదీన హుస్నాబాద్‌లో పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనతో నియోజకవర్గంలో కొత్త ఉత్సాహం వచ్చి, మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ దాఖలవడంపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ చర్యను దురదృష్టకరం అని పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు.

బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ముందుకు వచ్చినప్పుడు, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిపై ఇలా ఈడీ కేసులతో వేధించడం జరుగుతోందని ఆరోపించారు. ఓట్ల సవరణలు, తొలగింపులపై, 12 సంవత్సరాల వైఫల్యాలపై, రఫెల్ కుంభకోణం, కశ్మీర్ దాడుల నేపధ్యంలో అసమర్థ పాలన వంటి అంశాలపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ధైర్యంగా అధికార పక్షాన్ని నిలదీస్తారనే భయంతోనే ఇలా కేసులతో వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి వేధింపులు కొత్తకాదని, ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని, బీజేపీ 'తాటాకు చప్పుళ్లకు' ఎవరూ భయపడరు అని అన్నారు.

* ముఖ్యమంత్రి సభ వివరాలు

మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ సభ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు ఇక్కడికి వస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమావేశం అయినప్పటికీ, సిద్దిపేట, హనుమకొండ జిల్లా ప్రజలు కూడా వస్తారని మంత్రి తెలిపారు. గ్రామాల నుంచి ప్రజలు స్వయంగా సభకు వస్తామని కోరుతున్నారని, ఎన్నికల కోడ్ ఉన్నందున అధికారికంగా ఏర్పాట్లు చేయకపోయినా వారే తరలి వస్తున్నారని మంత్రి తెలిపారు. ‛హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి విద్యా, వ్యవసాయం, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన హుస్నాబాద్ మరింత అభివృద్ధికి తోడ్పడుతుంది’ అన్నారు. ఎన్నికల కోడ్ ఇబ్బంది లేకపోతే గౌరవెల్లి భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.

* తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వ విజన్

తెలంగాణను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. తెలంగాణను కోర్ అర్బన్, రీజియన్, సెమీ అర్బన్ రీజియన్, రూరల్ ఏరియాలుగా విభజించి ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఒక విజన్ తో ముందుకు పోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం 'బంగారు తెలంగాణ' వంటి విజన్‌లు మాత్రమే చెప్పాయని కేసీఆర్, చంద్రబాబు నాయుడులను ఉద్దేశిస్తూ అన్నారు. అయితే తమ ప్రభుత్వం 2047 విజన్ తో ముందుకు పోతోందని, దేశానికి తెలంగాణ దిక్సూచి లాగ అభివృద్ధి చెందేలా కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తూ, హైదరాబాద్‌ను భౌగోళికంగా, నీటి సౌకర్యాలు, రోడ్లు, ఎయిర్‌పోర్ట్, కాలుష్య రహిత నగరంగా మౌలిక సదుపాయాలతో దేశంలో నివసించడానికి మంచి భవిష్యత్ ఉన్న నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు పోతోందని వివరించారు.