01-12-2025 09:03:15 PM
గంభీరావుపేట (విజయక్రాంతి): గ్రామ పంచాయతి ఎన్నికల నేపథ్యంలో గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దమ్మ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆకస్మిక పరిశీలన చేశారు. చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల ప్రక్రియ, పోలీస్ సిబ్బంది నిర్వహణను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డీఎస్పీ వాహన తనిఖీల రిజిస్టర్‌ను పరిశీలించి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం, ఇతర అనధికార రవాణాలను అరికట్టాలని ఆదేశించారు.
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం లేదా విలువైన వస్తువులు తరలిస్తున్నట్లు సమాచారం లభిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లేదా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.