calender_icon.png 1 December, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి

01-12-2025 08:24:32 PM

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ..

రెబ్బెన (విజయక్రాంతి): రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పిలుపునిచ్చారు. సోమవారం రెబ్బెన మండల కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మండల అధ్యక్షుడు లావుడే రమేష్, ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి సుగుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ… గ్రామాల్లో పార్టీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త గ్రామస్థాయి సమస్యలకు స్పందిస్తూ పనిచేయాలని సూచించారు.

సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని అన్నారు. సీనియర్, జూనియర్ తేడాలేకుండా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి, రెబ్బెన మండల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కోరుతానని సుగుణక్క హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షురాలిగా మొదటిసారి రెబ్బెన మండలానికి వచ్చిన ఆమెకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.