22-05-2025 12:00:00 AM
చాలెంజ్‌గా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్, మే 21 : ఈనెల 23న జహీరాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి సీఎం పర్యటన వివరాలను వివరించారు.
23న ముఖ్యమంత్రి బస్సాపూర్ గ్రామ శివారులో హెలికాప్టర్ ద్వారా వచ్చి ముందుగా ఉగ్గేల్లి గ్రామ శివారులో హైవే రోడ్డుపై ఏర్పాటు చేసిన జగద్గురువు బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడినుండి మాస్నూరు గ్రామ శివారులో గల కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా అల్గోల్ బైపాస్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే బ్రిడ్జిని సమావేశ స్థలి వద్దనే ప్రారంభిస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటనను ఒక ఛాలెంజ్ గా తీసుకొని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు కోరారు. మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ తో పాటు తెలంగాణ రాష్ర్ట సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉజ్వల్ రెడ్డి, శుక్లవర్ధన్ రెడ్డి, హనుమంతరావు పాటిల్, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు కృషి చేస్తున్నారు.
ఇలావుండగా ముఖ్యమంత్రి పర్యటనను జహీరాబాద్ కాంగ్రెస్ నాయకులు చాలెంజ్‌గా తీసుకొని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఉగ్గేలి సమీపంలో ప్రారంభించనున్న జగద్గురు బసవేశ్వరుని విగ్రహ సమీపంలో పనులను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగించనున్న సభాస్థలిని రెండు రోజుల నుండి శ్రమించి కార్మికులు ఏర్పాటు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, రెవెన్యూ డివిజన్ అధికారి రాంరెడ్డి, వివిధ మండలాల మండల అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులు సీఎం పర్యటన రహదారి వెంబడి ఎలాంటి పిచ్చి మొక్కలు లేకుండా తొలగించేందుకు ఏర్పాట్లు;చేశారు.