calender_icon.png 26 July, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ గృహాల నిర్మాణాలలో పురోగతి కనిపించాలి

26-07-2025 12:04:42 AM

గద్వాల,(విజయక్రాంతి): ఇందిరమ్మ గృహాల నిర్మాణాలలో పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఇందిరమ్మ గృహాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు 7 వేల ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 543 గృహాలు మాత్రమే బేస్మెంట్ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వము వహించ రాదని, క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ,నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి కనిపించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో టాప్10 లో  ఉండేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు.పంచాయతీ సెక్రటరీలు, ఏ.ఈ.లు, వార్డ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా  ప్రోత్సహించాలని ఆదేశించారు. స్థలాలపై వెంటనే మార్కింగ్ చేసి, బేస్‌మెంట్ పనులు ప్రారంభించి, ప్రతి విజిట్‌కి ఫోటోలు అప్‌లోడ్ చేసి, పనుల స్థితిని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన ఇసుక, మట్టి సోమవారం నుండి అన్ని మండలాల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అన్ని మున్సిపల్ పట్టణాలు,గ్రామ పంచాయతీలలో లబ్దిదారుల వివరాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్ లో ఆన్లైన్ నమోదు చేయాలని ఆదేశించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో లక్ష్యం మేరకు సమిష్టిగా మొక్కలు నాటాలున్నారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను మున్సిపల్ గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు.  జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు.  రోడ్లపై, గుంతలలో నీరు నిలవకుండా చూడాలని అధికారులను సూచించారు.