26-07-2025 12:04:46 AM
నిజామాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ శిథిలావస్థకు తెలంగాణ సర్కారు నీళ్లొదిలి నట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బోధన్లో పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం చకాచకా అడుగులు వేస్తుండటం దీనికి మరింత బలపరుస్తున్నది. ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదిగా రికార్డు ఎక్కిర బోధన్ షుగర్ ఫ్యాక్టరీ..
ఒకప్పుడు కార్మికులకు చేతినిండా పని కల్పించి, రైతులకు కల్పతరువులా వెలుగొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలో 2002లో ఈ కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేశారు. కొనుగోలు చేసిన దక్కన్ డెల్టా యజమాన్యం నష్టాల సాకుతో 2015లో లేఆఫ్ ప్రకటించడంతో మూతపడింది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉపాధి కల్పించిన ఫ్యాక్టరీ పూర్వ వైభవం కోల్పోయింది.
నేతల మాటలు.. నీటి మూటలు
తెలంగాణలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న అప్పటి టీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఇచ్చిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఇదే హామీని మ్యానిఫెస్టోలో పొందుపరిచి గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కూడా నిజాం షుగర్స్ తెరిపించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తెరపైకి పామ్‌ఆయిల్ పరిశ్రమ
నిజామాబాద్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి సుముఖంగా ఉండటం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికిని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు ముందుకు సాగకపోవడంపై సందేహాలు వ్యక్తంఅవుతున్నాయి. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సాధించిన రాష్ట్ర సర్కారు ఇక్కడ పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు సన్నద్ధమైంది. చెరుకు సాగుకు చిరునామాగా ఉండే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న మెదక్ జిల్లా రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు మళ్ళించడం లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మీరు సాగు చేయండి.. మీరు తెరవండి!
షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి అందుకు రూ.190 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. దీంతోపాటు అనుబంధంగా డిస్టీలరీని కూడా ప్రారంభిస్తామని, ఒకటి రెండు నెలల్లో ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి బోధన్లో ఏర్పాటుచేసిన రైతు అవగాహన కార్యక్రమంలో తెలిపారు. ఇప్పటికీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభం కాలేదు.
చెరుకు పండిస్తే ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెరుకు కమిషన్, ప్రభుత్వం చెబుతుండగా.. విధివిధానాలు ఖరారు చేసి ఫ్యాక్టరీని ప్రారంభిస్తే చెరుకును పండిస్తామని రైతులు అంటున్నారు. గతంలో షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ నడిచే సమయంలో 13,500 ఎకరాల్లో చెరుకు సాగయ్యేది.
ఇప్పుడు అది గణనీయంగా పడిపోవడంతో మిగిలిన రైతులను సైతం ఆయిల్ పామ్ వైపు మళ్ళించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పైగా చెరుకు కంటే తక్కువ పెట్టుబడి తక్కువ నీటితో ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చని రైతులకు అవగాహన కల్పించే పనిలో ప్రభుత్వం ఉంది.
రైతుల ఆగ్రహానికి గురవ్వక తప్పదు
కవితను ఎంపీగా, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ను గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని నాడు కేసీఆర్ చెప్పారు. కానీ, టీఆర్‌ఎస్ గెలిచిన తర్వాత ఆ హామీని విస్మరించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోని రేవంత్రెడ్డి సర్కారుకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇతర పరిశ్రమ స్థాపించినా షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించాలి. రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
దినేష్‌కులచారి, బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
షుగర్ ఫ్యాక్టరీని తెరిచి అభివృద్ధి చేయాలి
ఈ మధ్యకాలంలో అన్ని పార్టీల వాళ్లకు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం ఎన్నికల హామీగా మారింది. గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇందులో పనిచేసిన కార్మికులు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. రోగాలపాలైన చనిపోయిన వారున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నావారు ఉన్నారు. రేవంత్ సర్కారు అయినా ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులు, రైతుల అభ్యున్నతికి కృషిచేయాలి.
పెద్ది వెంకట్రాములు,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ,
నిజామాబాద్