calender_icon.png 1 August, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరికొండలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

25-07-2025 12:26:11 AM

  1. పీ.హెచ్.సీ, ప్రభుత్వ బడులు, తహసీల్దార్ కార్యాలయం, ఎరువుల గిడ్డంగి పరిశీలన 
  2. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్ రూంల సందర్శన 

నిజామాబాద్ జూలై 24 :(విజయ క్రాంతి):  సిరికొండ మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఉన్నత, ప్రైమరీ పాఠశాలలు, పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగి, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. స్థానికంగా లబ్ధిదారులు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాన్ని సైతం సందర్శించిన కలెక్టర్, అర్హులైన వారికి కేటాయించేలా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  ముందుగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. హాజరు పట్టిక ప్రకారం వైద్యాధికారి, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని పరిశీలించారు. పీ.హెచ్.సీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి మెడికల్ ఆఫీసర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అన్ని రకాల ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామాలలో విరివిరిగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించి, మెనూ ప్రకారం ఉన్నాయా అని తనిఖీ చేశారు. 

ఇంకనూ ఏమైనా మౌలిక వసతులు అవసరం ఉన్నట్లయితే, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలని ఎంఈఓ రాములుకు,  ప్రధానోపాధ్యాయులు సతీశ్, నరేష్ లకు సూచించారు.     స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ రవీందర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అమలులో జిల్లాను ముందంజలో నిలిపేలా చిత్తశుద్ధితో పని చేయాలని హితవు పలికారు. కొత్త రేషన్ కార్డులు, పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, అర్హులకు ఆమోదం తెలుపాలని అన్నారు.

ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్ కింద నిర్ణీత రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు సత్వరమే ప్రభుత్వం ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. కాగా, పీఏసీఎస్ ఎరువుల గోడౌన్ ను సందర్శించి, ఎరువుల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.