25-07-2025 12:25:34 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో జూలై 24,(విజయక్రాంతి): ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఈఎన్‌సీ చీటి మురళీధర్‌రావుపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. కోర్టు అనుమతితో బుధవారం ఆయనను ఏసీబీ కస్టడీలోకి తీసుకున్నది.
ఏసీబీ విజ్ఞప్తి మేరకు బుధవారం నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఐదు రోజుల పాటు మురళీధర్‌రావును కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఆయనను నాంపల్లిలోని సిటీ రేంజ్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
మొదటి రోజు విచారణలో కీలక ప్రశ్నలు
కస్టడీలోకి తీసుకున్న మొదటి రోజే మురళీధర్‌రావును అధికారులు పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రధానంగా ఆయన వృత్తిగత జీవితానికి సంబంధించిన వివరాలపై దృష్టి సారించారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలతో పాటు, వేతనం ద్వారా ఆయన సంపాదన, ప్రధాన ఖర్చుల వివరాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు.
గతంలో నిర్వహించిన సోదాల్లో గుర్తించిన పలు ఆస్తుల వివరాలకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఇరిగేషన్ శాఖలో మురళీధర్‌రావు చేరిన నాటి నుంచి ఈఎన్‌సీగా పదోన్నతులు పొందే వరకు సంబంధించిన వివరాలతో కూడిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
రెండో రోజు దర్యాప్తులో బినామీ ఆస్తులు, లాకర్లపై దృష్టి
గురువారం రెండో రోజు విచారణలో భాగంగా మురళీధర్‌రావు వద్ద నుంచి సీజ్ చేసిన పత్రాలు, ఇతర ఆస్తుల వివరాలపై ఏసీబీ లోతుగా విచారించిన్నట్టు సమాచారం. ముఖ్యంగా బినామీ ఆస్తులు, వాటి కొనుగోలు తేదీలు, ఈఎన్‌సీగా పనిచేసిన కాలంలో కొనుగోలు చేసిన ఆస్తులపై ఏసీబీ అధికారులు ప్రధానంగా ఆరా తీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇంజినీర్లు క్లియరెన్స్ ఇస్తేనే బిల్లులు చెల్లించే విధానంలో అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఈఎన్‌సీగా మురళీధర్‌రావుకు ఈ అవినీతి వ్యవహారాలతో ఉన్న సంబంధాలపై ఏసీబీ కూపీ లాగింది.
అంతేకాకుండా, మురళీధర్‌రావుకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను కూడా ఏసీబీ అధికారులు తెరవనున్నారు. దీని ద్వారా మరిన్ని కీలక పత్రాలు, బంగారం వంటి నగలు దొరికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఒక్కొక్క ఇంజినీర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను సేకరించి రైడ్స్ నిర్వహిస్తున్నారు. మురళీధర్‌రావు కస్టడీలో ఉన్న మిగిలిన మూడు రోజుల్లో ఈ కేసులో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.